VBK News - జాతీయం / యాదాద్రి ( భువనగిరి ) : ఒకేరోజు 51 పరిశ్రమల ప్రారంభోత్సవాలు, మరికొన్నిటికి శంకుస్థాపనలు.. ఈ కార్యక్రమాలన్నిటితో చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ లో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఈరోజు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాలన్నీ జరగాల్సి ఉంది. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో పరిశ్రమలను ప్రారంభిస్తారు మంత్రి కేటీఆర్. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పరిశ్రమలను ప్రారంభిస్తున్నారు.
చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ లో జరిగే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులోని 51 పరిశ్రమలను ప్రారంభిస్తారు మంత్రి కేటీఆర్. వీటితోపాటు ఇక్కడే ఉన్న స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, కామన్ ఫెసిలిటీ సెంటర్, సీవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంటు, ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ కార్యాలయం(ఐలా), తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య కార్యాలయాలను ఆయన ప్రారంభిస్తారు. ఆ పక్కనే 100 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్న టాయ్స్ పార్క్ కు శంకుస్థాపన చేస్తారు మంత్రి కేటీఆర్. 12 మంది పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల ఏర్పాటుకి స్థలాలు కేటాయింపు పత్రాలను ఇస్తారు.
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో ఏర్పాటు చేసిన, చేస్తున్న పరిశ్రమల ద్వారా 40వేల మందికి ఉపాధి లభిస్తుంది. 542 ఎకరాల్లో 400 పైగా పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటవుతున్నాయి. మూడు దశల్లో ఈ ఇండస్ట్రియల్ పార్క్ ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమల ద్వారా 3వేలమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తున్న పరిశ్రమల్లో.. రక్షణ పరికరాల తయారీ, సోడామిషన్ మేకింగ్, ఎర్త్ డ్రిల్లింగ్ ఎక్విప్ మెంట్, మైనింగ్ యంత్రాలు, ఆహార పదార్థాలు, వివిధ రకాల ప్యాకేజ్డ్ ఫుడ్, బుక్స్, సిమెంట్ బ్రిక్స్, టైల్స్, కూలర్లు, రైస్ గ్రైండింగ్ మిషన్లు, ఇంజినీరింగ్ పరికరాల తయారీ, ఫ్యాబ్రికేషన్, యూపీవీసీ కిటికీల తయారీ యూనిట్లు ప్రధానంగా ఉన్నాయి. మంత్రి వెంట ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ సత్పతి ఇతర అధికారులు పాల్గొంటారు.
Admin
VBK News